రోజూ ఒక గుడ్డు తినడం వల్ల శరీరానికి శక్తి లభించడం, కండరాల బలం పెరగడం, రోగనిరోధక శక్తి మెరుగుపడడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పిల్లల ఎదుగుదల, విద్యార్థుల ఏకాగ్రత, పెద్దల శారీరక ఆరోగ్యానికి గుడ్డు ఎంతో ఉపయుక్తం.
ఇందులో ఉండే విటమిన్ A, B12, D, ఐరన్, కాల్షియం, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పనితీరు, ఎముకల బలం, కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి.
అంతేకాకుండా భారతదేశంలో గుడ్డుతో చేసే వంటకాలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. ప్రతి రాష్ట్రంలోనూ గుడ్డుతో చేసే వంటకాలు వేర్వేరు రుచుల్లో, ప్రత్యేక శైలుల్లో కనిపిస్తాయి. సాధారణ ఎగ్ కర్రీకి భిన్నంగా, ఈసారి కొంచెం కొత్తగా, రెస్టారెంట్ స్టైల్‌లో ఏదైనా ట్రై చేయాలంటే ‘కాజూ ఎగ్ మసాలా’ ఒక అద్భుతమైన ఎంపిక.
అయితే కాజూ ఎగ్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం 🥳
కావలసిన పదార్థాలు
- గుడ్లు – 4 నుంచి 5 (ఉడికించినవి)
- జీడిపప్పు – 15 నుంచి 20 (నానబెట్టినవి)
- ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
- టమాటాలు – 2 (ప్యూరీ లేదా ముక్కలు)
- అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
- నూనె / నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు
- ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా – రుచికి సరిపడా
- కసూరి మేథీ, కొత్తిమీర, కరివేపాకు – ఫ్లేవర్ కోసం
తయారీ విధానం
- ముందుగా గుడ్లను ఉడికించి, పొట్టు తీసి పక్కన పెట్టుకోండి.
- నానబెట్టిన జీడిపప్పులను కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేయండి.
- ఉడికించిన గుడ్లకు చిన్న గాట్లు పెట్టి, కొద్దిగా ఉప్పు మరియు కారం కలిపిన నూనెలో 2 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోండి.
- అదే పాన్‌లో అవసరమైతే ఇంకొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి బాగా వేడి చేయండి. నూనె వేడెక్కిన తరువాత జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి సువాసన వచ్చే వరకు వేయించండి.
- ఆ తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, మద్యమ మంటపై బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించండి.
- ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పూర్తిగా పోయే వరకు వేయించండి.
- ఇప్పుడు టమాటో ప్యూరీ వేసి, పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలపండి.
- మసాలా నుంచి నూనె పైకి తేలే వరకు మూత పెట్టి మగ్గనివ్వండి.
- తరువాత జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలపండి. గ్రేవీ చిక్కదనాన్ని బట్టి తగినన్ని నీళ్లు పోయండి.
- గ్రేవీ మరింత రుచిగా కావాలంటే 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకోవచ్చు.
- గ్రేవీ ఉడుకుతున్నప్పుడు వేయించిన గుడ్లను అందులో వేసి కలపండి.
- చివరగా గరం మసాలా, కొద్దిగా కసూరి మేథీ చల్లి, తక్కువ మంటపై 5 నిమిషాలు ఉంచండి.
- చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి కాజూ ఎగ్ మసాలా సిద్ధం!
ఈ కాజూ ఎగ్ మసాలాను చపాతీ, నాన్, రొట్టె లేదా జీరా రైస్‌తో సర్వ్ చేస్తే రుచి అదిరిపోతుంది 😋 ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి!
