కోడి తోలు ఆమ్లెట్ వినగానే కొంచెం కొత్తగా అనిపించొచ్చు… కానీ ఒక్కసారి రుచి చూస్తే మాత్రం మళ్లీ మళ్లీ చేయాలనిపించే స్పెషల్ రెసిపీ ఇది.
కోడి తోలులో ఉండే సహజమైన జ్యూసీనెస్‌కి, గుడ్ల మృదుత్వం కలిసినప్పుడు వచ్చే ఫ్లేవర్ వేరే లెవల్. ముఖ్యంగా వేడి వేడి అన్నంతో కలిసి తింటే… “అబ్బా! టేస్ట్ అదిరిపోయింది” అనకుండా ఉండలేరు.
కూరగాయలతో, మసాలాలతో కలిసిన ఈ ఆమ్లెట్ ప్లేట్‌లో పెట్టిన క్షణాల్లోనే ఖాళీ అయిపోతుంది. ఇంట్లో అందరికీ కొత్తగా, భలే రుచిగా నచ్చే వంటకం కావాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్.
ఇంకెందుకు ఆలస్యం? ఈ రెసిపీని చదివి మీరు కూడా ట్రై చేయండి.
కావాల్సిన పదార్థాలు:
చికెన్ స్కిన్ – 150 గ్రాములు,
నూనె – 2 టేబుల్ స్పూన్లు,
కోడిగుడ్లు – 2,
ఉల్లిపాయ – చిన్నది ఒకటి,
కారం – అర టీ స్పూన్,
పసుపు – అర టీ స్పూన్,
ఉప్పు – తగినంత,
ధనియాల పొడి – కొద్దిగా,
కొత్తిమీర – అవసరమైనంత.
కోడి తోలు ఆమ్లెట్ తయారీ విధానం:
ముందుగా చికెన్ స్కిన్‌ను తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసుకుని పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిసే వరకు గరెటితో తిప్పాలి. ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోండి.
తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి చికెన్ స్కిన్‌ను లైట్‌గా నూనెలో వేయించాలి. ఇలా చేయడం వలన పచ్చిదనం పోతుంది.
ఇప్పుడు ఆ వేయించిన చికెన్ స్కిన్‌ను ముందుగా పెట్టుకున్న బౌల్‌లో వేసుకుని, దానిలో కోడిగుడ్లు కొట్టి, ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిసే వరకు తిప్పుకోవాలి.
ఆ తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్లు నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత గిన్నెలో కలిపి పెట్టుకున్న కోడిగుడ్ల మిశ్రమాన్ని నెమ్మదిగా పాన్‌లో పోయండి.
పైగా కొద్దిగా కొత్తిమీర చల్లి మూత పెట్టి మధ్య మంటపై ఉడికించాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి ఆమ్లెట్‌ను జాగ్రత్తగా తిప్పుతూ రెండు వైపులా బాగా కాల్చాలి.
బంగారు రంగులోకి వచ్చి మంచి వాసన వచ్చిన వెంటనే పాన్ నుంచి తీసి ఒక ప్లేట్‌లోకి మార్చండి. అంతే… రుచికరమైన, వేడి వేడి కోడి తోలు ఆమ్లెట్ రెడీ!

