భారత క్రికెట్ జట్టు టీ20 ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలవడమే కాకుండా, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ తిరుగులేని అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
తాజా ఐసీసీ వార్షిక అప్‌డేట్ ప్రకారం.. మే 2025 నుంచి ఆడిన మ్యాచ్‌లకు 100 శాతం, అంతకుముందు రెండేళ్లలో ఆడిన మ్యాచ్‌లకు 50 శాతం వెయిటేజీని ఇచ్చారు.
భారత్: 275 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
ఇంగ్లాండ్: 262 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
ఆస్ట్రేలియా: 258 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
మిగిలిన జట్లు న్యూజిలాండ్ (4), దక్షిణాఫ్రికా (5), పాకిస్థాన్ (6), వెస్టిండీస్ (7) వరుస స్థానాల్లో ఉన్నాయి. అయితే.. శ్రీలంక ఆరు రేటింగ్ పాయింట్లను కోల్పోయి 9వ స్థానానికి పడిపోగా, ఒక పాయింట్ సాధించిన బంగ్లాదేశ్ 8వ స్థానానికి ఎగబాకింది. అఫ్గానిస్తాన్ 10వ స్థానంలో నిలవగా, జింబాబ్వే (11), ఐర్లాండ్ (12) తమ స్థానాలను కాపాడుకున్నాయి.
ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వేదికలపై అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న అమెరికా జట్టు, తాజాగా 6 పాయింట్లను సాధించి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి చేరింది. నెదర్లాండ్స్, స్కాట్లాండ్‌లను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించింది. నేపాల్, ఒమన్ జట్లు కూడా ఒక్కో స్థానం మెరుగుపరుచుకుని వరుసగా 17, 19 స్థానాల్లో నిలిచాయి.
ముఖ్యంగా తొలిసారి ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఇటలీ అందరినీ ఆశ్చర్యపరిచింది. నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన ఇటలీ, 11 పాయింట్లను తన ఖాతాలో వేసుకుని 26 నుంచి 23వ ర్యాంకుకు చేరుకుంది.
