సముద్రంలో దొరికే ఒక అసహ్యకరమైన పదార్థం.. బంగారం, వెండి, వజ్రాల కంటే అత్యంత విలువైనదని మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. దాని పేరే 'అంబర్‌గ్రిస్' (Ambergris). వాడుక భాషలో దీనిని 'తిమింగలం వాంతి' (Whale Vomit) అని పిలుస్తారు. సముద్రంలో తేలియాడే ఈ పదార్థానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. నాణ్యతను బట్టి కిలో అంబర్‌గ్రిస్ ధర సుమారు రూ.1 కోటి నుండి రూ.2 కోట్ల వరకు పలుకుతోంది.
అసలు అంబర్‌గ్రిస్ అంటే ఏమిటి? ఇది ఎలా ఏర్పడుతుంది?
అంబర్‌గ్రిస్ అనేది స్పెర్మ్ వేల్స్ (Sperm Whales) అనే ఒక రకమైన భారీ తిమింగలాల జీర్ణకోశంలో ఉత్పత్తి అయ్యే మైనం లాంటి పదార్థం. ఈ తిమింగలాలు ప్రధానంగా స్క్విడ్ (Squid), కట్‌ల్ ఫిష్ వంటి సముద్ర జీవులను వేటాడి తింటాయి. అయితే, ఆ జీవులకు ఉండే గట్టి ముక్కులు, దవడలు, ముళ్లు తిమింగలాల కడుపులో సులభంగా జీర్ణం కావు. అవి పేగులకు గుచ్చుకోకుండా, లోపల గాయాలు కాకుండా ఉండటం కోసం తిమింగలం కడుపులో ఒక ప్రత్యేకమైన స్రావం ఉత్పత్తి అవుతుంది. ఆ స్రావం ఈ గట్టి భాగాల చుట్టూ చేరి, కాలక్రమేణా ఒక మైనపు ముద్దలా మారుతుంది. ఇది బాగా పెద్దదైన తర్వాత, జీర్ణం కాని ఆ వ్యర్థాన్ని తిమింగలం వాంతి రూపంలో లేదా మలం రూపంలో సముద్రంలోకి విసర్జిస్తుంది.
p>ఎందుకంత ధర? అంతలా ఎక్కడ ఉపయోగిస్తారు?అంబర్‌గ్రిస్‌ను ప్రధానంగా ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన, ఖరీదైన పరిమళ ద్రవ్యాల (Perfumes) తయారీలో ఉపయోగిస్తారు. పర్ఫ్యూమ్స్ సువాసన గాలిలో త్వరగా ఆవిరైపోకుండా, మనిషి చర్మంపై ఎక్కువ సేపు నిలిచి ఉండేలా చేయడానికి (Fixative గా) ఇది అద్భుతంగా పనిచేస్తుంది. డయార్, చానెల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్స్ తమ ఖరీదైన పెర్ఫ్యూమ్స్‌లో దీనిని ఉపయోగిస్తాయి.
