టీ20 ప్రపంచకప్‌లో అత్యంత కీలకమైన సూపర్-8 దశలో ఉన్న టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ ఫినిషర్, ఆల్‌రౌండర్ రింకూ సింగ్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడడంతో ఆయన జట్టును వీడాల్సి వచ్చింది. కొంతకాలంగా లివర్ కేన్సర్‌తో బాధపడుతున్న రింకూ సింగ్ తండ్రి ఆరోగ్యం విషమించడంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. లివర్ కేన్సర్ 4వ దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్‌లో అతడు ఆడే అవకాశాలు దాదాపుగా లేనట్లేనని తెలుస్తోంది.
సూపర్-8 దశలో తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో టీమిండియా సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇకపై మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాయింట్ల పట్టికలో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది.
ఇలాంటి కీలక సమయంలో జట్టు స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ దూరం కావడం భారత శిబిరానికి మరింత ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో రింకూ మంచి ఫీల్డర్ కూడా కావడం జట్టుకు మరో లోటు. కీలక సమయంలో అద్భుత క్యాచ్‌లు, చురుకైన ఫీల్డింగ్‌తో మ్యాచ్ గమనాన్ని మార్చగల సామర్థ్యం అతనికి ఉంది. ఇలాంటి ఆటగాడు జట్టులో లేకపోవడం వ్యూహాత్మకంగా ప్రభావం చూపనుంది.
రింకూ సింగ్ స్థానంలో తుది జట్టులోకి వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను తీసుకునే అవకాశాలున్నాయి. దీంతో పాటు, దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అనుకోకుండా పక్కనపెట్టిన స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో మళ్లీ జట్టులోకి తీసుకురావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలా చేస్తే టీమిండియా బ్యాటింగ్ మరింత బలంగా మారే అవకాశం ఉంది.
