టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైన నెదర్లాండ్స్ జట్టు తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. మ్యాచ్ మొత్తం సమంగా సాగినప్పటికీ, చివరి ఓవర్లలో జరిగిన తప్పిదాలు వారి పరాజయానికి కారణమయ్యాయి. కీలక సమయంలో బౌలింగ్, ఫీల్డింగ్‌లో లోపాలు కనిపించడంతో గెలిచే అవకాశాన్ని కోల్పోయారు.
ఈ మ్యాచ్ అనంతరం నెదర్లాండ్స్ పేసర్ పాల్ వాన్ మీకెరెన్ స్పందిస్తూ, పాకిస్థాన్ తమను ఓడించలేదని, తామే తమ చేతులతో మ్యాచ్‌ను చేజార్చుకున్నామని చెప్పాడు. చివరి దశలో మెరుగ్గా ఆడితే ఫలితం మారే అవకాశం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డాడు.
148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు ఆరంభంలో కొంత గందరగోళానికి గురైంది. అయినప్పటికీ 10 ఓవర్లు ముగిసే సరికి కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 90 పరుగులు సాధించింది. ఆ దశలో రన్‌రేట్ అనుకూలంగా ఉండటంతో మ్యాచ్ పూర్తిగా పాకిస్థాన్ చేతుల్లోకి వెళ్లినట్టే అనిపించింది.
అయితే ఆ తర్వాత నెదర్లాండ్స్ బౌలర్లు అద్భుతంగా పోరాడుతూ మ్యాచ్‌కు కొత్త మలుపు ఇచ్చారు. కట్టుదిట్టమైన బౌలింగ్, క్రమశిక్షణతో కూడిన లైన్-లెంగ్త్‌తో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్‌లపై ఒత్తిడి పెంచారు. ఫలితంగా వరుసగా వికెట్లు పడుతూ స్కోరు వేగం ఒక్కసారిగా తగ్గిపోయింది. 16.1 ఓవర్లు ముగిసే సమయానికి పాకిస్థాన్ జట్టు 7 వికెట్లు కోల్పోయి కేవలం 114 పరుగులకే పరిమితమైంది.
ReadAlso:రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగుతారా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
గెలుపునకు ఇంకా 34 పరుగులు కావాలి. పాకిస్థాన్ జట్టులో హిట్ బ్యాట్స్‌మన్స్ లేకపోవడంతో ఆ సమయంలో పాకిస్థాన్ ఓడిపోవడం ఖాయమనే భావన అందరిలోనూ కలిగింది.
అయితే అక్కడే మ్యాచ్ దిశ పూర్తిగా మారిపోయింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఫహీమ్ అష్రఫ్ పరిస్థితిని పూర్తిగా తలకిందులు చేశాడు. కేవలం 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫహీమ్ అష్రఫ్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను నెదర్లాండ్స్ ఫీల్డర్లు చేజార్చారు. అదే క్షణం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆ ఒక్క తప్పిదమే చివరికి నెదర్లాండ్స్ జట్టు ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన పాల్ వాన్ మీకెరెన్ తన మనసులో మాట చెప్పాడు. “ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలవలేదు. మేమే మమ్మల్ని ఓడించుకున్నాం. ఆ ఒక్క తప్పిదమే మా ఓటమికి కారణం” అని ఆయన వ్యాఖ్యానించాడు.
