రూ.20 లక్షల స్కాలర్‌షిప్ అవకాశం – అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం పూర్తి వివరాలు
విదేశాల్లో చదువుకోవాలనే ఆశ చాలా మంది విద్యార్థులకు ఉంటుంది. అయితే ఆర్థిక పరిమితులు, కుటుంబ పరిస్థితుల కారణంగా ఆ అవకాశాన్ని వినియోగించుకోలేని పరిస్థితి చాలామందిలో కనిపిస్తుంది. ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులు ఎక్కువగా ఉండటంతో, విదేశీ విద్య చాలామందికి కలగానే మిగిలిపోతుంది.
ఈ నేపథ్యంలో అర్హత ఉన్న విద్యార్థులు తమ విద్యా లక్ష్యాలను చేరుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకంను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించి, విద్యార్థులకు సహాయకారిగా నిలుస్తోంది.
ఈ పథకం ద్వారా అర్హత కలిగిన విద్యార్థులకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. అదనంగా, విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన విమాన ప్రయాణ ఖర్చుల కోసం రూ.50 వేల సాయంను కూడా ప్రభుత్వం అందిస్తోంది.
విదేశాల్లో ఉన్నత విద్యకు అయ్యే భారీ ఖర్చులను దృష్టిలో పెట్టుకుంటే, ఈ సహాయం ఎంతోమంది పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు నిజంగా ఓ వరంలా మారిందని చెప్పవచ్చు.
ఈ పథకం ఎవరి కోసం?
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం, ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక కారణాల వల్ల వెనుకబడిపోయే విద్యార్థులకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది.
ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరు అర్హులు? ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? అనే పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
అర్హతలు (Eligibility Criteria):
- కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలి
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
- ఇంతకు ముందు ఎలాంటి పీజీ (Post Graduation) పూర్తి చేసి ఉండకూడదు
- ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అర్హత
- విదేశీ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ ఉండాలి
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా GRE లేదా GMAT వంటి ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
రాష్ట్ర స్థాయిలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుంది.
అవసరమైన డాక్యుమెంట్లు:
- చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ జిరాక్స్
- విదేశీ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ (Offer) లెటర్
- వీసా జిరాక్స్
- ట్యూషన్ ఫీజు వివరాలు
- పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
- 10వ తరగతి మెమో
- బోనాఫైడ్ సర్టిఫికెట్
- బ్యాంక్ పాస్‌బుక్
- ఆధార్, రేషన్ కార్డు
- స్థానికత ధ్రువపత్రం
- చివరి కోర్సు మార్కుల మెమో
- ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (TC)
- GRE / GMAT / ఇతర స్కోర్ కార్డులు
దరఖాస్తు విధానం:
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తెలంగాణ ePASS అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు సమయంలో అవసరమైన అన్ని ధ్రువపత్రాలను JPG ఫార్మాట్‌లో మాత్రమే అప్లోడ్ చేయాలి.
