ఇంటి పరిశుభ్రత ఎంత ముఖ్యమో, బాత్రూమ్ పరిశుభ్రత కూడా అంతే కీలకం. ఇల్లు మరియు వంటగది ఎంత శుభ్రంగా, అందంగా ఉన్నా, బాత్రూమ్ మురికిగా ఉండడం లేదా దుర్వాసన రావడం వల్ల ఇంటి మొత్తం వాతావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇంటి శుభ్రత గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది హాల్, బెడ్‌రూమ్, కిచెన్‌పైనే దృష్టి పెడతారు.
బాత్రూమ్ అనేది రోజువారీగా ఎక్కువగా ఉపయోగించే ప్రదేశం. సరైన శుభ్రత పాటించకపోతే క్రిములు, బాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో బాత్రూమ్ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
![]() |
| getty images |
బాత్రూమ్‌ను ప్రతిరోజూ శుభ్రం చేసినప్పటికీ దుర్వాసన సమస్య తగ్గకపోవడం అనేది చాలా ఇళ్లలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. ఉదయం, సాయంత్రం క్లీనింగ్ చేసినా కూడా వాసన పూర్తిగా పోకపోవడం వల్ల చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఖరీదైన రూమ్ ఫ్రెషనర్లు, కెమికల్ క్లీనర్లు ఉపయోగిస్తున్నప్పటికీ అవి తాత్కాలికంగా మాత్రమే వాసనను కప్పిపుచ్చుతాయి గానీ మూల కారణాన్ని తొలగించవు.
అదికాక కొన్ని రూమ్ ఫ్రెషనర్లలో ఉండే గాఢమైన సువాసనలు కొందరికి అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆ వాసన వల్ల తలనొప్పి, వికారం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు.
బాత్రూమ్ నుంచి వాసన రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, డ్రెయిన్ పైపుల్లో మలినాలు పేరుకుపోవడం, టాయిలెట్ మరియు నేలలో మురికి నిల్వ ఉండటం వంటి కారణాల వల్ల దుర్వాసన ఎప్పుడూ వస్తూనే ఉంటుంది.
అయితే, కొన్ని ఇంటి చిట్కాలు బాత్రూమ్ నుంచి వచ్చే వాసనను దూరం చేస్తాయి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.
బేకింగ్ సోడా, వెనిగర్ చిట్కా
![]() |
| getty images |
బాత్రూమ్ దుర్వాసనల్ని తొలగించడానికి బైకార్బోనేట్ ఆఫ్ సోడా (బేకింగ్ సోడా), వెనిగర్ మిశ్రమం ఒక మంచి పరిష్కారం. ఇందుకోసం ముందుగా ఒక పాత్రలో ఒక కప్పు బేకింగ్ సోడా, ఒక కప్పు వైట్ వెనిగర్ కలపాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత దానిని బాత్రూమ్ పైపుల్లో పోయాలి.
దానిని కొద్దిసేపు అలాగే ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇది దుర్వాసనను తొలగించడమే కాకుండా బ్యాక్టీరియా, మురికిని కూడా శుభ్రపరుస్తుంది.
నిమ్మకాయ, ఉప్పు ట్రిక్
![]() |
| getty images |
బాత్రూమ్‌లో వచ్చే దుర్వాసనను తగ్గించడంలో నిమ్మకాయ–ఉప్పు మిశ్రమం ఒక సులభమైన మరియు సహజ పరిష్కారంగా ఉపయోగపడుతుంది. ఇంట్లోనే సులభంగా లభించే ఈ పదార్థాలు శుభ్రతకు మాత్రమే కాకుండా వాసన నియంత్రణకూ సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి ఆ మిశ్రమాన్ని బాత్రూమ్ నేలపై, వాష్ బేసిన్‌పై, టైల్స్ మూలల్లో రుద్దాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచి తరువాత నీటితో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా నీరు ఎక్కువగా చేరే ప్రదేశాల్లో ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుంది.
నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ సహజ శుభ్రపరిచే లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది మురికి, మరకలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉప్పు స్వల్పంగా రుద్దే గుణం కలిగి ఉండటంతో పట్టుబట్టి ఉన్న మలినాలను తొలగించడంలో ఉపకరిస్తుంది. ఈ రెండింటి కలయిక దుర్వాసనకు కారణమయ్యే సూక్ష్మ జీవుల పెరుగుదలను తగ్గించడంలో తోడ్పడుతుంది.
కర్పూరంతో వాసనను తొలగించవచ్చు
కర్పూరం బలమైన సువాసనతో పాటు సహజ యాంటీబాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది గాలిలో నెమ్మదిగా కరిగి దుర్వాసనకు కారణమయ్యే సూక్ష్మజీవులను తగ్గించడంలో సహాయపడుతుంది.
దీనికోసం రాత్రి పడుకునే ముందు బాత్రూమ్ కమోడ్‌లో కొన్ని కర్పూరం బిళ్లలు వేయాలి. అవి రాత్రంతా నీటిలో కరిగి కమోడ్, పైపులలో సువాసనను వ్యాపింపజేస్తాయి. ఉదయం ఫ్లష్ చేయడం వల్ల దుర్వాసన తగ్గి బాత్రూమ్ తాజాగా ఉంటుంది.


