ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ పథకంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉండగా, ఇప్పుడు పురుషులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కేబినెట్ సమావేశంలో “ఇంద్రధనస్సు” పేరుతో పురుషుల కోసం కొత్త పథకాన్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం స్త్రీశక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూటమి సర్కార్ అందిస్తోంది. ఈ క్రమంలో ఉచిత బస్సు ప్రయాణ పథకంపై చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు కూడా ఫ్రీ బస్ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న ప్రభుత్వం, “ఇంద్రధనస్సు” పేరుతో దివ్యాంగులైన పురుషులకు కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించనుంది. దీనికి సంబంధించిన బిల్లును కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టగా, కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ పథకం అమలులోకి రానుంది.
అయితే ఉచిత బస్సు ప్రయాణం నాన్ స్టాప్, అంతరాష్ట్ర, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో వర్తించదు. ఈ బస్సుల్లో 50 శాతం రాయితీ కొనసాగుతుంది. దివ్యాంగుల ధృవీకరణ పత్రాలు పరిశీలించిన అనంతరం జీరో టికెట్ జారీ చేస్తారు.
అలాగే స్త్రీశక్తి పథకం వర్తించని బస్సుల్లో దివ్యాంగులకు ఎప్పటిలాగే రాయితీ సౌకర్యం కొనసాగుతుంది. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఇది పెద్ద శుభవార్తగా చెప్పవచ్చు.
