ఆంధ్రప్రదేశ్‌లో అసైన్డ్ భూములపై కీలక నిర్ణయం తీసుకున్నారు. అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ద్వారా అసైన్డ్ భూములను సౌర విద్యుత్ సంస్థలకు లీజుకు ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతి కల్పించింది. రాష్ట్రంలో పునరుత్పాదక శక్తి ఉత్పత్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టారు. బిల్లుపై సభలో విస్తృత చర్చ అనంతరం సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సవరణ ద్వారా అసైన్డ్ భూముల వినియోగంపై ఉన్న కొన్ని నిబంధనలను సవరించి, ప్రభుత్వం నిర్ణయించిన ప్రత్యేక అవసరాల కోసం లీజు విధానంలో ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. ముఖ్యంగా పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు, ముఖ్యంగా సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ఈ మార్పులు దోహదపడతాయని మంత్రి వివరించారు.
ఇక రేషన్ కార్డు, హెల్త్ కార్డు అవసరం లేదు – స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ సరిపోతుంది
ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ, అసైన్డ్ భూములను సౌర విద్యుత్ సంస్థలకు లీజుకు ఇచ్చేలా చట్ట సవరణ చేశామని తెలిపారు. హరిత ఇంధన సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 7 లక్షల 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
