భారతదేశంలో గుండెపోటు కేసులు రోజురోజుకూ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. టీవీ వార్తలు, సోషల్ మీడియా చూస్తే దాదాపు ప్రతిరోజూ ఆకస్మిక గుండెపోటుతో మరణించిన ఘటనలు మన కళ్లముందు కనిపిస్తున్నాయి. ఒక తాజా నివేదిక ప్రకారం, ముఖ్యంగా 40 ఏళ్ల లోపు మరియు చుట్టుపక్కల వయసు ఉన్నవారిలో గుండెపోటుల సంఖ్య 25 నుంచి 30 శాతం వరకు పెరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ఇంతకుముందు గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వృద్ధులకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు యువత, మధ్య వయస్సు వారిని కూడా ఇవి వేగంగా చుట్టుముట్టుతున్నాయి. సరైన హెచ్చరికలు లేకుండా, ఒక్కసారిగా వచ్చే ఆకస్మిక గుండెపోటు కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతుండటం మరింత భయానక విషయం.
అదే సమయంలో సకాలంలో సరైన చికిత్స అందకపోవడం కూడా అనేక ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణంగా మారుతోంది. గుండెపోటు వచ్చిన వెంటనే ఆసుపత్రికి చేరకపోవడం, లేదా మొదటి గంటలో (Golden Hour) తగిన వైద్యం అందకపోవడం వల్ల పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. ముఖ్యంగా ఇంట్లో లేదా ఒంటరిగా ఉన్న సమయంలో గుండెపోటు వస్తే ఏం చేయాలో తెలియక చాలా మంది అయోమయంలో పడిపోతున్నారు.
ఇదిలా ఉండగా, ఈ రోజుల్లో గుండెపోటు విషయంలో ప్రజల్లో అవగాహన రోజురోజుకీ పెరుగుతోంది. వైద్య నిపుణులు, ఆరోగ్య సంస్థలు, అలాగే సోషల్ మీడియా వేదికల ద్వారా కీలక సమాచారం ప్రజలకు చేరుతోంది.
ఈ క్రమంలోనే ప్రముఖ అమెరికన్ వైద్యుడు, కార్డియోవాస్కులర్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ముఖ్యమైన వీడియోను షేర్ చేశారు.
ఆ వీడియోలో, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినట్లయితే వెంటనే ఏం చేయాలి, ఎలా స్పందించాలి అనే విషయాలను చాలా సులభంగా, స్పష్టంగా వివరించారు. జెరెమీ లండన్ ఇచ్చిన ఈ సూచనలు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేలా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గుండెపోటు అనిపిస్తే వెంటనే ఏం చేయాలి?
మీకు గుండెపోటు వచ్చినట్టు అనిపించి అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని డాక్టర్ సూచిస్తున్నారు. ఇంట్లో ఎవరు లేకపోతే, వెంటనే అత్యవసర నెంబర్‌కు కాల్ చేసి మీ పరిస్థితిని తెలియజేయడం చాలా ముఖ్యమని ఆయన అంటున్నారు.
మీ ఫోన్‌లో స్పీడ్ డైల్ ఆప్షన్ ఉంటే, వెంటనే కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడికి కాల్ చేసి ఈ విషయాన్ని తెలియజేసి అప్రమత్తం చేయాలి.
లేదంటే నేరుగా అంబులెన్స్ నెంబర్‌కు ఫోన్ చేయాలని డాక్టర్ సూచిస్తున్నారు. మీరు స్పృహలో ఉండగానే, మిమ్మల్ని సంప్రదించగల లేదా ఆలస్యం చేయకుండా సాయం అందించగల వ్యక్తికి వెంటనే సమాచారం ఇవ్వడం అత్యంత అవసరం.
రెండో ముఖ్యమైన పని: ఆస్ప్రిన్ నమలడం
మీరు చేయాల్సిన రెండో ముఖ్యమైన పని ఆస్ప్రిన్‌ను నమలడం అని కార్డియాలజిస్ట్ స్పష్టంగా తెలిపారు. గుండెపోటు వచ్చిన సమయంలో ఆస్ప్రిన్ టాబ్లెట్‌ను ఎప్పుడూ నేరుగా మింగడానికి ప్రయత్నించకూడదని ఆయన హెచ్చరిస్తున్నారు. దానికి బదులుగా, దానిని దంతాలతో బాగా నమలాలి.
ఆస్ప్రిన్‌ను నమలడం వల్ల ఔషధం త్వరగా రక్తంలోకి చేరి పనిచేస్తుంది. దీని ద్వారా గుండెపోటు తీవ్రత కొంతవరకు తగ్గుతుంది. అయితే ఇది గుండెపోటును పూర్తిగా ఆపివేయదు.
కానీ గుండెపై పడే అకస్మిక ఒత్తిడిని, షాక్‌ను తగ్గించి పరిస్థితి మరింత విషమం కాకుండా చేయడంలో ఆస్ప్రిన్ సహాయపడుతుందని డాక్టర్ జెరెమీ లండన్ వివరించారు.

