చికెన్ బిర్యానీ రెసిపీ | పెళ్లి స్టైల్ టేస్టీ బిర్యానీ తెలుగులో

చికెన్ బిర్యానీ – రుచుల రాజు, పండుగల వంటకం

చికెన్ బిర్యానీ అంటే నాన్ వెజిటేరియన్స్ అందరికీ ఒక ప్రత్యేకమైన పండుగ వంటకమే అని చెప్పాలి. సువాసనలతో నిండిన మసాలా, మెత్తగా ఉడికిన చికెన్, పొడవైన బాస్మతి బియ్యం కలిసి తయారయ్యే ఈ వంటకం భారతీయ వంటకాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

పెళ్లిళ్లు, పుట్టినరోజులు, పండుగలు, ఫ్యామిలీ గెటెటుగెదర్స్ లేదా ఫ్రెండ్స్ పార్టీలు—ఏ సందర్భమైనా సరే మొదట గుర్తుకు వచ్చేది చికెన్ బిర్యానీనే. ప్రతి ప్రాంతానికి త‌నదైన రుచి, వంట పద్ధతి ఉండటంతో ఇది ఎప్పటికీ బోర్ కొట్టని వంటకంగా నిలిచిపోయింది.

హైదరాబాద్ చికెన్ బిర్యానీ, ఆంధ్ర స్టైల్ బిర్యానీ, లక్నో అవధి బిర్యానీ, కేరళ దమ్ బిర్యానీ—పేర్లు మారినా, రుచి మారినా బిర్యానీ మీద ఉండే ప్రేమ మాత్రం ఎప్పుడూ తగ్గదు. ఇక ఇంట్లో మనమే చేసుకుంటే ఆ ఆనందం ఇంకాస్త ఎక్కువే.

కావలసిన పదార్థాలు

  • చికెన్ – ఒక కిలో
  • బాస్మతి బియ్యం – ఒక కిలో
  • పెరుగు – ఒక కప్పు
  • అల్లం ముద్ద – ఒక టేబుల్ స్పూన్
  • వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూన్
  • గరం మసాలా పొడి – రెండు టీ స్పూన్లు
  • పచ్చిమిరపకాయలు – ఐదు
  • ఎండు మిరపకాయలు – ఆరు
  • ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు
  • నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
  • నూనె – సరిపడంత
  • పసుపు – చిటికెడు
  • కొత్తిమీర – ఒక కట్ట
  • ఉప్పు – తగినంత

చికెన్ సిద్ధం చేసే విధానం

ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా వడగట్టాలి. ఆ తరువాత చికెన్‌లో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం రెండు గంటల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల చికెన్ మెత్తగా ఉడుకుతుంది మరియు మసాలా లోపలికి బాగా ఇమిడుతుంది.

బియ్యం ఉడికించే విధానం

బాస్మతి బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగి అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. తరువాత నీటిని వడగట్టి ఉంచాలి. ఒక పెద్ద పాత్రలో నీరు మరిగించి అందులో కొద్దిగా ఉప్పు, నెయ్యి వేసి బియ్యం వేసి సగం మాత్రమే ఉడికించాలి. పూర్తిగా ఉడకకూడదు.

బిర్యానీ తయారీ విధానం

స్టౌ మీద ఒక గిన్నె పెట్టి సరిపడా నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు వేసి వాసన వచ్చే వరకు వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

Special Chicken Biryani Recipe
image:swasthis recipes

ఇప్పుడు నానబెట్టిన చికెన్‌ను వేసి మధ్యస్థ మంటపై కొద్దిసేపు వేపాలి. చికెన్ నుంచి వచ్చే నీరు తగ్గిన తరువాత గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి.

ఇప్పుడు బిర్యానీని పొరలుగా వేయాలి. ముందుగా పాత్రలో కొంత చికెన్ మిశ్రమం వేసి, దానిపై సగం ఉడికిన బియ్యం వేయాలి. మళ్లీ చికెన్ పొర వేసి చివరగా మిగిలిన అన్నాన్ని వేసి పై నుంచి కొత్తిమీర చల్లి మూత పెట్టాలి. తక్కువ మంటపై దమ్ పద్ధతిలో సుమారు 20 నిమిషాలు ఉడికించాలి.

సర్వ్ చేసే విధానం

బిర్యానీ సిద్ధమైన తర్వాత మూత తీసి నెమ్మదిగా కలపాలి. వేడి వేడి చికెన్ బిర్యానీని ఉల్లిపాయ రాయితా, సలాడ్ లేదా మిర్చి కా సలాన్‌తో సర్వ్ చేస్తే రుచి రెట్టింపు అవుతుంది.

ఇంట్లో ప్రేమతో చేసిన ఈ చికెన్ బిర్యానీ కుటుంబ సభ్యులందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక్కసారి ఈ విధంగా ప్రయత్నిస్తే హోటల్ బిర్యానీని మర్చిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Post a Comment

Previous Post Next Post

Contact Form