కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం భక్తులతో కలకలలాడే ఈ పుణ్యక్షేత్రానికి రావడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే తీసుకున్న నిర్ణయం వారందరికీ ఊరట కలిగించనుంది.
కొత్తగా నిర్మాణం పూర్తయిన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ నెల 26వ తేదీ సాయంత్రం 3 గంటలకు ప్రారంభించనున్నారు. అదే రోజున మధ్యాహ్నం 2.20 గంటలకు తొలి డెమూ రైలు ఇక్కడ నిలవనుంది.
సిద్దిపేట - సికింద్రాబాద్ - సిద్దిపేట డెమూ రైళ్లు కొమురవెల్లి మీదుగా ప్రయాణిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఇక్కడ నిలవడం లేదు. ఎందరో భక్తుల కోరిక మేరకు దక్షిణ మధ్య రైల్వే కొత్త స్టేషన్‌ను నిర్మించింది. ఇకపై ఈ మార్గంలో ప్రయాణించే రెండు డెమూ రైళ్లు కొమురవెల్లి స్టేషన్‌లో నిలవనున్నాయి.
