ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉండగా, దాదాపు 4.3 కోట్ల మంది లబ్ధిదారులు ప్రతి నెలా రేషన్ బియ్యం పొందుతున్నారు. ఒక్కో వ్యక్తికి నెలకు ఐదు కిలోల చొప్పున బియ్యం అందజేస్తున్నారు. అయితే ఈ బియ్యంలో కొంత భాగం అక్రమ రవాణాకు గురవుతోందన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి.
ఈ అక్రమ రవాణాను అరికట్టి పేదలకు నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా సరఫరా చేస్తున్న సాధారణ బియ్యం స్థానంలో దశలవారీగా స్టీమ్ రైస్ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ముందుగా ఈ విధానాన్ని మధ్యాహ్న భోజన పథకంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, ఫలితాలను పరిశీలించిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థలో పూర్తిస్థాయిలో అమలు చేసే అవకాశాలను అధ్యయనం చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
