భారత విశిష్ట గుర్తింపున(UIDAI) ఆధార్ కార్డు వినియోగదారులకు ఒక తీపి కబురు అందించింది. ఇకపై ఆధార్‌తో ఈమెయిల్ ఐడీని లింక్ చేయడం లేదా అప్‌డేట్ చేసుకునే సేవలను పూర్తిగా ఉచితం చేసింది. ఇప్పటివరకు ఈ సేవను ఉపయోగించుకోవడానికి రూ. 75 ఫీజు చెల్లించాల్సి ఉండేది, కానీ డిజిటల్ సేవలను మరింత మందికి చేరువ చేసేందుకు మరియు భద్రతను పటిష్టం చేసేందుకు వీలుగా ఈ ఛార్జీలను కేంద్రం పూర్తిగా రద్దు చేసింది.
ఈ సరికొత్త నిర్ణయం జూలై 1, 2026 నుండి అమలులోకి రానుంది. ఈ తేదీ నుండి డిసెంబర్ 31, 2026 వరకు, అంటే మొత్తం ఆరు నెలల పాటు ఎలాంటి అదనపు రుసుములు లేకుండా ఉచితంగా ఈమెయిల్ అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఈ ఉచిత సేవ ఆధార్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే లభిస్తుందని UIDAI స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆధార్ సేవలు ఇంటి నుంచే సులభంగా పొందేందుకు UIDAI అనేక కొత్త సౌకర్యాలు అందిస్తోంది. గతంలో చిరునామా మార్పు, మొబైల్ నంబర్ అప్‌డేట్, ఆధార్ లాక్ లేదా అన్‌లాక్ వంటి సేవల కోసం సేవా కేంద్రాలను ఆశ్రయించాల్సి వచ్చేది.
ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన ఆధార్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఎన్నో ముఖ్యమైన సేవలు ఉచితంగా లభిస్తున్నాయి. ఈమెయిల్ అప్‌డేట్ కూడా ఆ జాబితాలో చేరింది. ఈమెయిల్ లింక్ చేయడం వల్ల ఆధార్ సంబంధిత ముఖ్యమైన నోటిఫికేషన్లు, అప్‌డేట్స్ తదితర సమాచారం సకాలంలో మెయిల్ ద్వారా వస్తాయి.
