రేషన్ కార్డు (ఆహార భద్రతా కార్డు).. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది కేవలం చౌక ధరలకు నిత్యావసర సరుకులు అందించే కార్డు మాత్రమే కాదు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అసలైన గేట్ వే. ఆరోగ్యశ్రీ మొదలుకొని, ఇళ్ల స్థలాలు, ఫీజు రీయింబర్స్ మెంట్, పెన్షన్ల వరకు ప్రతి ప్రభుత్వ పథకానికి రేషన్ కార్డే ప్రధాన ప్రామాణికం. అయితే, త్వరలో రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోబోతోందని, అనర్హులైన వారి కార్డులను రద్దు చేసేందుకు భారీ ప్రక్షాళనకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. అర్హులైన పేదలకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో లక్షలాది రేషన్ కార్డులు వాడుకలో ఉన్నాయి. అయితే, ఇందులో పెద్ద సంఖ్యలో బోగస్ కార్డులు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ దృష్టికి వచ్చింది. ఆర్థికంగా స్థిరపడిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్లు ఉన్నవారు కూడా తెల్ల రేషన్ కార్డులను వినియోగిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల నిజమైన పేదలకు అందాల్సిన లబ్ధి దారి తప్పుతోంది. ఈ నేపథ్యంలోనే నకిలీ లబ్ధిదారులను ఏరివేసి, ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే హైదరాబాద్‌లో దాదాపు 2 లక్షల మంది ఐటీ చెల్లింపుదారులు రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టీజీ విజిలెన్స్ విభాగం రహస్య ఆడిట్‌లో ఈ విషయం బయటపడింది. దీంతో వీరి రేషన్ కార్డులను రద్దు చేయడంతో పాటు ఇప్పటివరకు పొందిన సబ్సిడీలను రికవరీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాన్ కార్డు, జీఎస్టీ నెంబర్లను రేషన్ కార్డు డేటాతో లింక్ చేశారు. దీంతో నగరంలో దాదాపు 2 లక్షల మంది ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ రేషన్ కార్డు పొందుతున్నట్లు వెల్లడైంది. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు, ఐటీ చెల్లింపుదారులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో గుర్తించారు. అనంతరం అనర్హుల డేటా బయటకు వచ్చింది.
