భారత్–న్యూజిలాండ్ మధ్య నిన్న జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది.
అభిషేక్ శర్మ షో: 35 బంతుల్లో 84 – న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన యువ ఓపెనర్
భారత్ భారీ స్కోర్ నమోదు చేయడంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అసలైన హీరోగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అభిషేక్ 35 బంతుల్లో 84 పరుగులు చేసి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపే తిప్పేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండటం విశేషం. 240కు పైగా స్ట్రైక్‌రేట్‌తో ఆడిన అభిషేక్ బ్యాటింగ్ అభిమానులను ఉర్రూతలూగించింది
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అభిషేక్, పవర్‌ప్లేలోనే న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పేస్ అయినా, స్పిన్ అయినా తేడా లేకుండా ధాటిగా బాదుతూ పరుగుల వేగాన్ని అమాంతం పెంచాడు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ న్యూజిలాండ్ బౌలర్లపై పూర్తి ఒత్తిడి తీసుకొచ్చారు. టాప్ ఆర్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా కీలక భాగస్వామ్యాలు అందించడంతో భారత్ భారీ లక్ష్యాన్ని నిలబెట్టగలిగింది.
239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులకే పరిమితమైంది. గ్లెన్ ఫిలిప్స్ 40 బంతుల్లో 78 పరుగులతో అద్భుత పోరాటం చేశాడు. అతడితో పాటు మార్క్ చాప్మన్ (39), డారిల్ మిచెల్ (28) కొంతమేరకు ప్రయత్నించినప్పటికీ, అవసరమైన రన్‌రేట్ అధికంగా ఉండటంతో మ్యాచ్ భారత్ వైపే మళ్లింది.
