సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరంగా ఉండాలని తాను నిర్ణయించుకున్నట్లు ప్రకటించాడు. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో తన పేరు నమోదు చేసుకోబోనని వెల్లడించాడు. ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైందని, తన కెరీర్ ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకొని తీసుకున్నదేనని స్పష్టం చేశాడు.
అయితే ఇది క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం కాదని ఫాఫ్ ఖచ్చితంగా తెలియజేశాడు. ప్రస్తుతం తాను పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)పై పూర్తి దృష్టి సారించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నానని వివరించాడు. అంతర్జాతీయ క్యాలెండర్, ఫిట్‌నెస్ నిర్వహణ, ఆటపై సమగ్రంగా దృష్టి పెట్టడం వంటి అంశాలే ఈ ఎంపికకు కారణమని పేర్కొన్నాడు.
14 సీజన్ల తర్వాత, ఈ ఏడాది ఐపీఎల్ వేలం బరిలోకి దిగకూడదని నిర్ణయించుకున్నాను. ఈ లీగ్ నా కెరీర్‌లోనే ఒక పెద్ద భాగం. ప్రపంచ స్థాయి సహచరులతో.. అద్భుతమైన ఫ్రాంచైజీల కోసం, అంకితభావంతో కూడిన అభిమానులు ముందు ఆడటం నాకు దక్కిన అదృష్టం. భారత్ నాకు మంచి స్నేహాలను, మధురమైన జ్ఞాపకాలను ఇచ్చింది.
భారత్‌కు తన హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉందని చెబుతూ ఫాఫ్ డుప్లెసిస్ అభిమానులను భావోద్వేగానికి గురి చేశాడు. “ఇది వీడ్కోలు కాదు… మళ్లీ కలుస్తాను. మీరు నన్ను మళ్లీ చూస్తారు” అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఒక ఏడాది పాటు పూర్తిగా కొత్త సవాల్‌ను స్వీకరించాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించాడు.
రాబోయే పాకిస్థాన్ సూపర్ లీగ్ సీజన్‌లో తాను బరిలోకి దిగుతున్నానని వెల్లడించాడు. ఇది తన కెరీర్‌లో మరో ప్రత్యేకమైన అధ్యాయానికి ఆరంభమని చెప్పాడు. “కొత్త దేశం, కొత్త వాతావరణం, కొత్త సవాల్… ఇవన్నీ నా ఆటకు మరో కొత్త అనుభవాన్ని అందిస్తాయి” అని తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
