పండుగ రుచి అదిరిపోయేలా: గోదారోళ్ల కొబ్బరి పాకుండలు.. ఇలా చేస్తే పర్ఫెక్ట్!

ఇంటి ముందు తెల్లవారుజామునే రంగురంగుల ముగ్గులు మెరిసిపోతాయి. గొబ్బెమ్మలతో ఆడపడుచుల సందడి, హరిదాసుల కీర్తనలు, బసవన్నల దీవెనలతో గ్రామాలన్నీ పండుగ వాతావరణంతో నిండిపోతాయి. కొత్త బట్టలు, పల్లెటూరి ఆటలు, గాలిపటాల ఎగరవేత, బంధువుల కలయిక… ఇవన్నీ కలిసి సంక్రాంతిని మరింత మధురంగా మారుస్తాయి.

ఇంటి నిండా ఘుమఘుమలాడే అరిసెలు, బొబ్బట్లు, సకినాలు, గారెలు, పాయసం వంటి పిండివంటల వాసన ఈ పండుగకు ప్రత్యేక గుర్తింపు. తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఆనందంగా గడిపే ఈ మూడు రోజుల పండుగ—భోగి, సంక్రాంతి, కనుమ—మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది.

>అంతేకాదు సంక్రాంతి కి చెసే కొబ్బరి పాకుండలు మరింత బాగుంటాయి . కొబ్బరి, బెల్లం రుచితో నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ పాకుండలు గోదావరి జిల్లాల సంక్రాంతి స్పెషల్. కొబ్బరి పాకుండలు మీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు

  • బియ్యం
  • -బెల్లం
  • -పచ్చి కొబ్బరి
  • -యాలకుల పొడి
  • -నెయ్యి
  • -నూనె
  • తయారీ విధానం

    ముందుగా 1 కేజీ బియ్యాన్ని (కొత్త బియ్యం అయితే ఇంకా బెటర్) బాగా శుభ్రంగా కడిగి, సరిపడా నీళ్లు పోసి కనీసం 18 గంటల పాటు నానబెట్టాలి.తర్వాత నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి, ఒక శుభ్రమైన పొడి గుడ్డపై పరచి 15–20 నిమిషాల పాటు ఆరబెట్టాలి. బియ్యం పూర్తిగా ఎండిపోకూడదు—కొద్దిగా తేమ ఉన్నప్పుడే మిక్సీలో వేసి మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టాలి.

    తర్వాత స్టవ్ మీద గిన్నె లేదా పాన్ పెట్టి అందులో పావు కేజీ బెల్లం తురుము,పావు కప్పు నీళ్లు పోసి ముద్ద పాకం(అరిసెల పాకం)వచ్చే వరకు మరిగించాలి. పాకం కొంచెం చల్లటి నీళ్లలో వేస్తే మెత్తని జల్లీలా ఉండలా ఏర్పడ్డాక స్టవ్ ఆపేసి దించేయాలి

    తర్వాత బెల్లం పాకం ఉన్న పాన్‌లోనే 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, 1 మీడియం సైజ్ పచ్చి కొబ్బరికాయ తురుము వేసాలి. అనంతరం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న తడి పిండిని 4 కప్పులు (బెల్లం తీసుకున్న కప్పు కొలతనే) మెల్లిగా జత చేస్తూ, మిశ్రమం మొత్తం బాగా కలిసేలా నిరంతరం కలుపుకోవాలి.ఇందులో 1 టీస్పూన్ యాలకల పొడి వేసి మరోసారి బాగా కలపాలి. చివరికి పిండి ముద్దలా, దగ్గరగా ఉండేలా చూసుకోవాలి

    కలిపిన పిండిని 15 నిమిషాలు పక్కన పెట్టేయండి. దీంతో అది చల్లారుతుంది.తర్వాత చేతికి,పళ్లెనికి నెయ్యి రాసి కలపిన పిండిని నిమ్మకాయ సైజు అంత ఉండలుగా చేసుకోండి.

    తర్వాత స్టవ్‌పై బాండీ పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి బాగా వేడెక్కనివ్వాలి. నూనె వేడయ్యాక బాండీ సైజును బట్టి పాకుండలను నూనెలో మెల్లిగా వేసి అలాగే వదిలేయాలి. మీడియం మంటపై నిదానంగా వేగనివ్వాలి. వెంటనే గరిటతో తిప్పకూడదు. పాకుండలు కాస్త వేగి పైకి తేలిన తర్వాత మాత్రమే గరిటతో అటు ఇటు తిప్పుతూ సమంగా వేయించాలి.

    పాకుండలు ముదురు గోల్డెన్ కలర్ లోకి రావడానికి సుమారు 10-12 నిమిషాలు పడుతుంది. అప్పుడు వాటిని బయటకు తీసుకోండి. అంతే పాకుండలు రెడీ.పండుగ రోజుల్లో కుటుంబంతో కలిసి వేడి వేడిగా ఆస్వాదిస్తే ఆ రుచే వేరు 😋

    Post a Comment

    Contact Form