మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మరో కీలక పదవి దక్కింది. చిరంజీవి పెద్ద కుమార్తె కొణిదెల సుస్మితను విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించినట్లు సమాచారం. రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖకు చెందిన అధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఈ నియామకం ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మెగా కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతుండగా, కొణిదెల నాగబాబుకు కూడా రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి దక్కింది. ఇప్పుడు చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితకు ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలి బాధ్యతలు ఇవ్వడంతో ఈ అంశంపై రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
మెగా కుటుంబానికి వరుసగా కీలక పదవులు దక్కుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే సుస్మిత నియామకంపై అధికారులు మాత్రం ఆమె సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకునే ఈ బాధ్యతలు అప్పగించినట్లు వివరణ ఇచ్చారు.
కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆలయ అభివృద్ధి, ఇతర అంశాలను పరిశీలించడంలో సుస్మిత సూచనలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి ఆమె సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఇక సుస్మిత విషయానికి వస్తే.. ఆమె సినీ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మాతగా, డిజైనర్‌గా పలు సినిమాలకు పనిచేశారు. ఇప్పుడు ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆమెకు అప్పగించిన బాధ్యతలపై ఆసక్తి నెలకొంది.
మొత్తంగా మెగా కుటుంబంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్, నాగబాబు కీలక బాధ్యతల్లో ఉండగా.. ఇప్పుడు సుస్మితకు కూడా దేవస్థానానికి సంబంధించిన పదవి రావడంతో ఈ అంశం రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
