ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి క్యాబ్, బైక్ ట్యాక్సీ యాప్స్ వాడే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రయాణం ప్రారంభం కాకముందే టిప్ ఇవ్వాలని ప్రయాణికులను అడిగే విధానం ఉండకూడదని స్పష్టం చేసింది.
కొన్ని యాప్స్‌లో రైడ్ బుక్ చేసుకునే సమయంలోనే ‘అడ్వాన్స్ టిప్’ ఇవ్వాలని నోటిఫికెషన్స్ కనిపిస్తున్నాయి. ముందుగా టిప్ ఇస్తే డ్రైవర్ త్వరగా వస్తారని, రైడ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం తగ్గుతుందని ప్రయాణికులకు నోటిఫికెషన్స్ వస్తున్నాయి. దీంతో రైడ్ కోసం అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ విధానంపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) చర్యలు తీసుకుంది. ప్రయాణం పూర్తికాకముందే టిప్ అడిగే లేదా టిప్ ఇవ్వాలని ప్రోత్సహించే ఫీచర్లను యాప్స్ నుంచి తొలగించాలని రవాణా అగ్రిగేటర్లను ఆదేశించింది.
మోటార్ వాహనాల అగ్రిగేటర్ గైడ్‌లైన్స్, 2025లోని క్లాజ్ 14.15 ప్రకారం టిప్ అనేది పూర్తిగా ప్రయాణికుడి స్వచ్ఛంద నిర్ణయం మాత్రమేనని స్పష్టం చేసింది. బుకింగ్ సమయంలో కానీ, ప్రయాణం ప్రారంభం కావడానికి ముందు కానీ లేదా ప్రయాణం జరుగుతున్న సమయంలో కానీ టిప్ అడిగేందుకు వీల్లేదని తెలిపింది. ప్రయాణం విజయవంతంగా పూర్తయిన తర్వాత మాత్రమే ఈ ఆప్షన్‌ను ప్రయాణికులకు చూపించాలని కేంద్రం తేల్చిచెప్పింది.
