DWCRA Groups: 8 మంది సభ్యులున్నా రిపీట్ డోస్ రుణం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) సభ్యులకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాలకు మరిన్ని ప్రయోజనాలు అందించే దిశగా ప్రభుత్వం తాజాగా నిబంధనల్లో మార్పులు చేసింది

ఇప్పటివరకు ఒక డ్వాక్రా సంఘంలో కనీసం 10 మంది సభ్యులు ఉండాలనే నిబంధన ఉంది. అయితే ఇకపై 8 మంది సభ్యులు ఉన్న సంఘాలకు కూడా రుణాలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు అందించేలా వెసులుబాటు కల్పించారు.

DWCRA Groups 8 members repeat dose loan Andhra Pradesh government decision

దీంతో 8 మంది సభ్యులతో ఉన్న స్వయం సహాయక సంఘాలు కూడా రుణ సదుపాయాలతో పాటు అర్హతకు అనుగుణంగా ఇతర ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం చిన్న సంఖ్యలో సభ్యులు ఉన్న మహిళా సంఘాలకు మరింత ఉపయోగకరంగా మారనుంది.

గతంలో గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాల్లో సభ్యుల సంఖ్య 10 కంటే తక్కువగా ఉంటే, ఆ సంఘాలు సక్రమంగా పనిచేస్తున్నప్పటికీ మళ్లీ రుణం పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. ముఖ్యంగా సభ్యుల మరణం లేదా వలసల కారణంగా సభ్యుల సంఖ్య తగ్గిన సంఘాలకు ఈ సమస్య ఎక్కువగా ఉండేది.

ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏపీ గ్రామీణ బ్యాంక్ అంతర్గత ఉత్తర్వులు నంబర్ 152 ద్వారా ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలకమైన నిర్ణయంగా అభివర్ణించారు.

కొత్త నిబంధనల ప్రకారం కనీసం 8 మంది యాక్టివ్ సభ్యులు ఉన్న డ్వాక్రా సంఘాలకు కూడా రిపీట్ డోస్ రుణం మంజూరు చేసే అవకాశం ఉంటుంది. అయితే సభ్యుల సంఖ్య తగ్గడానికి వలసలు లేదా మరణం మాత్రమే కారణమై ఉండాలి.

అదేవిధంగా సంఘంలో ఎలాంటి అక్రమాలు లేకపోవడంతో పాటు, గతంలో తీసుకున్న రుణాలకు బకాయిలు ఉండకూడదు. రుణాలను సక్రమంగా చెల్లిస్తున్న సంఘాలకే ఈ వెసులుబాటు వర్తిస్తుందని అధికారులు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post

Contact Form