బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం విద్యుత్ సమస్య తీవ్రంగా మారుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ కోతలు ఉంటుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు కరెంట్ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది.
విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా షాపులు, మార్కెట్లు, మాల్స్‌ను రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. రాత్రి సమయంలో విద్యుత్ వాడకాన్ని తగ్గించి, అందుబాటులో ఉన్న విద్యుత్‌ను అవసరమైన ప్రాంతాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చుట్టూ ఉన్న గ్రామాల్లో విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతీ రోజూ ఇక్కడ 8-10 గంటల పాటు విద్యుత్ కోతలు ఉంటున్నాయి. దేశంలో విద్యుత్ డిమాండ్ సుమారు 18వేల మెగావాట్లుగా ఉండగా, సరఫరా 13వేల మెగావాట్లకు కూడా చేరుకోలేకపోతోంది. దీనికి ఉక్కపోత, వేడిమి తోడై అల్లాడుతున్నారు జనం.
అయితే విద్యుత్ కోతలతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. గంటల తరబడి కరెంట్ లేకపోవడంతో ఇళ్లలోనే కాకుండా వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కేంద్రాల వద్ద ప్రజలు నిరసనలకు దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్‌లో విద్యుత్ సమస్యకు ప్రధాన కారణం ఇంధనం, గ్యాస్ కొరత. LNG సరఫరా తగ్గడం, వాతావరణం కారణంగా కొన్ని నౌకలు సరుకును దించలేకపోవడం, దిగుమతి విద్యుత్ తగ్గడం వల్ల విద్యుత్ కోతలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు అదనపు డీజిల్ సరఫరా చేయాలని బంగ్లాదేశ్ భారత్‌ను కోరింది. భారత్-బంగ్లాదేశ్ పైప్‌లైన్ ద్వారా డీజిల్ సరఫరా చేసే అవకాశం ఉంది.
