ప్రభుత్వ ఉద్యోగం సాధించడం చాలా మంది యువతకు ఒక కల. లక్షలాది మంది అభ్యర్థులు ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి పరీక్షలు రాసినా ఉద్యోగం రావడం అంత సులభం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఝార్ఖండ్‌కు చెందిన అభయ్ కుమార్ తివారీ అనే వ్యక్తి గత 13 ఏళ్లలో ఏకంగా 12 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అతను సాధించిన ఉద్యోగాల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ (SI), ఫారెస్ట్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, భారత నౌకాదళం (Indian Navy), బాబా అణు పరిశోధనా కేంద్రం (BARC) వంటి ప్రముఖ సంస్థల్లో పోస్టులు ఉన్నాయి.అయితే ఈ వరుస ఉద్యోగాల వెనుక అతని టాలెంట్ కాకుండా పేపర్ లీకేజి వ్యవహారం దాగి ఉందనే బిగ్ ట్విస్ట్ బయటపడింది.
ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) ప్రశ్నాపత్రాల లీక్ కేసు దర్యాప్తులో అభయ్ కుమార్ తివారీ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దర్యాప్తులో భాగంగా, జేపీఎస్సీ పరీక్షలతో పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే కొన్ని నియామక పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్‌లో కూడా అతనికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ లీకేజీల కోసం అతడు ఒక నెట్‌వర్క్‌ను నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అధికారుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, లీక్ అయిన ప్రశ్నాపత్రాల ఆధారంగానే అభయ్ కుమార్ తివారీ గతంలో పలు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినట్లు ఆధారాలు లభించాయి. మొత్తం 12 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వ్యవహారాన్ని కూడా ఇదే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం సీఐడీ (CID) అధికారులు అభయ్ కుమార్ తివారీని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు, మరెన్ని పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి, ఈ నెట్‌వర్క్ ఎంత పెద్దది అనే విషయాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
