వర్షాకాలంలో చెరువులు, కుంటలు, పొలాల దగ్గర ఒక్కసారిగా కనిపించే పసుపు రంగు భారీ కప్పలను చూసి చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. వేసవి మొత్తం ఎక్కడా కనిపించని ఈ కప్పలు వర్షాలు పడగానే ఒక్కసారిగా బయటకు రావడం వెనుక ఆసక్తికరమైన కారణం ఎంటో తెలుసుకుందాం.
ఎండాకాలంలో వాతావరణం వేడిగా ఉండటంతో నీరు, ఆహారం దొరకడం కష్టమవుతుంది. అందుకే కొన్ని రకాల కప్పలు నేలలోని తేమ ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లి అక్కడే నిద్రావస్థలో ఉంటాయి. ఈ సమయంలో వాటి శరీర కార్యకలాపాలు చాలా నెమ్మదిగా జరుగుతాయి. బయట వాతావరణం అనుకూలంగా మారే వరకు అవి నేల నుంచి బయటకు రావు.
తొలి వర్షాలు కురిసి నేల తడిసిన వెంటనే పరిస్థితులు మారిపోతాయి. వాతావరణంలో తేమ పెరగడంతో ఈ కప్పలు నిద్రావస్థ నుంచి బయటకు వస్తాయి. చెరువులు, కుంటలు, గుంతల్లో నీరు చేరడంతో వాటికి ఆహారం కూడా సులభంగా లభిస్తుంది. ముఖ్యంగా వర్షాల సమయంలో బయటకు వచ్చే పురుగులు, కీటకాలు, చిన్న జీవులను ఇవి ఆహారంగా తీసుకుంటాయి.
వర్షాకాలంలో వీటి కదలికలు ఎక్కువగా కనిపించడానికి మరో ముఖ్యమైన కారణం సంతానోత్పత్తి. నీరు చేరిన ప్రదేశాలు గుడ్లు పెట్టడానికి, పిల్ల కప్పలు పెరగడానికి అనుకూలంగా ఉంటాయి. అందుకే వర్షాలు మొదలైన కొద్దిరోజుల్లోనే పెద్ద సంఖ్యలో కప్పలు బయటకు వచ్చి శబ్దాలు చేస్తూ కనిపిస్తాయి.
ఈ పసుపు రంగు కప్పలను సాధారణంగా ఇండియన్ బుల్‌ఫ్రాగ్ లేదా హాప్‌లోబాట్రాకస్ టైగెరినస్ అని పిలుస్తారు.సాధారణ రోజుల్లో ఈ కప్పలు ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో కనిపిస్తాయి. అయితే సంతానోత్పత్తి కాలంలో మగ కప్పల శరీరం ప్రకాశవంతమైన పసుపు లేదా బంగారు రంగులోకి మారుతుంది. ఆడ కప్పలను ఆకర్షించేందుకు ప్రకృతి కల్పించిన ప్రత్యేక లక్షణమిదని జీవశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
రైతులకు మేలు చెస్తాయా ?
ఈ కప్పలు మనకు తెలియకుండానే వ్యవసాయానికి ఎంతో మేలు చేస్తాయి. పొలాల్లో పంటలకు నష్టం చేసే అనేక పురుగులను తినడం ద్వారా కీటకాల సంఖ్యను తగ్గిస్తాయి. దీంతో రైతులకు సహజంగానే కొంత ప్రయోజనం కలుగుతుంది. రసాయన పురుగుమందులపై ఆధారపడకుండా ప్రకృతిలోని జీవులే ఒకదానికొకటి సహాయం చేసుకునే విధానానికి ఇది మంచి ఉదాహరణ.
