పండుగల కోసం బెస్ట్ స్వీట్: అటుకుల పెసరపప్పు పాయసం ఎలా చేయాలి?

పండుగ వచ్చిందంటే మన ఇంట్లో ఏదో ఒక స్వీట్ తప్పనిసరిగా చేస్తుంటారు. ఎక్కువ మంది సగ్గుబియ్యం పాయసానికే మొగ్గు చూపుతారు. అయితే ప్రతిసారి అదే రుచి తినడం కొంతమందికి బోర్‌గా అనిపించవచ్చు. అలాంటి వారు ఈసారి రుచికరమైన, ఆరోగ్యకరమైన అటుకుల పెసరపప్పు పాయసంను ఇంట్లో ట్రై చేయండి.

అటుకుల పెసరపప్పు పాయసానికి కావలసిన పదార్థాలు

ఒక కప్పు అటుకులు, పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు బెల్లం తురుము, ఒక కప్పు పాలు, మూడు కప్పుల నీరు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పులు, ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్, మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక కప్పు కొబ్బరి తురుము.

అటుకుల పెసరపప్పు పాయసం తయారీ విధానం

ముందుగా ఒక పాన్‌లో పెసరపప్పు వేసి మీడియం మంటపై సువాసన వచ్చే వరకు బాగా వేయించాలి. తరువాత వేయించిన పెసరపప్పును కుక్కర్‌లో లేదా మందపాటి గిన్నెలో వేసి మెత్తగా ఉడికించుకోవాలి.

ఇక అటుకులను ఒకసారి శుభ్రంగా కడిగి సుమారు 5 నిమిషాల పాటు మాత్రమే నానబెట్టాలి. ఎక్కువసేపు నానబెడితే అటుకులు మరీ మెత్తబడి ముద్దగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఈ దశలో కొద్దిగా జాగ్రత్త అవసరం.

ఇప్పుడు మరో గిన్నెలో బెల్లం, కొద్దిగా నీరు వేసి పూర్తిగా కరిగించాలి. అవసరమైతే వడగట్టి మలినాలను తొలగించుకోవచ్చు.

తర్వాత ఉడికిన పెసరపప్పులో నానబెట్టిన అటుకులు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యిపై సుమారు 5 నిమిషాలు మగ్గనివ్వాలి, తద్వారా అటుకులు మరియు పెసరపప్పు బాగా కలిసిపోతాయి.

ఆ తరువాత బెల్లం పాకాన్ని ఇందులో పోసి నెమ్మదిగా కలపాలి. బెల్లం వేసిన తర్వాత ఎక్కువసేపు హై ఫ్లేమ్‌పై ఉంచకూడదు. అలా చేస్తే పాయసం రుచి మారే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు పాలు పోసి మరో 2–3 నిమిషాలు సిమ్‌లో ఉడికిస్తే పాయసం మరింత క్రీమీగా, రుచిగా తయారవుతుంది. చివరగా యాలకుల పొడి వేసి బాగా కలపాలి.

ఇంకో చిన్న పాన్‌లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్‌ను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. వీటిని పాయసంలో వేసి కలిపి, చివరగా కొబ్బరి తురుము చల్లి వేడివేడిగా లేదా చల్లగా సర్వ్ చేసుకోవచ్చు.

Post a Comment

Previous Post Next Post

Contact Form