విశాఖపట్నం, కడప మధ్య నిత్యం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులకు, ముఖ్యంగా రాయలసీమ వాసులకు భారతీయ రైల్వే శాఖ ఒక శుభవార్తను అందించింది. ఇప్పటి వరకు కడప వరకే పరిమితమైన ప్రతిష్టాత్మక 'తిరుమల డెయిలీ ఎక్స్‌ప్రెస్' రైలు సేవలను గుంతకల్లు జంక్షన్ వరకూ పొడిగిస్తూ రైల్వే అధికారులు గురువారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రయాణ సదుపాయాలను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
ఎంతో రద్దీగా ఉండే ఈ రైలును మరింత ముందుకు పొడిగించాలన్న డిమాండ్ గత కొంతకాలంగా బలంగా వినిపిస్తోంది. రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధులు, వివిధ ప్రయాణికుల సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన రైల్వే బోర్డు.. ఎట్టకేలకు ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ రైలు ఇకపై అనంతపురం జిల్లాలోని ప్రముఖ రైల్వే జంక్షన్ అయిన గుంతకల్లు వరకు ప్రయాణికులకు తన సేవలను విస్తృతంగా అందించనుంది.
అయితే గుంతకల్లు-విశాఖపట్టణం తిరుమల ఎక్స్‌ప్రెస్ (18522) మే 15వ తేదీ నుంచి గుంతకల్లులో మధ్యాహ్నం ఒకటిన్నరకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు విశాఖపట్టణానికి చేరుకుంటుంది. దీని తిరుగు ప్రయాణపు రైలు (18521) మే 13వ తేదీ నుంచి విశాఖపట్టణంలో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు గుంతకల్లుకు చేరుతుందన్నారు.
