రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ఆటతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ముఖ్యంగా అతను కొట్టిన సిక్సర్లు, ధైర్యంగా ఆడిన తీరు మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అతనిపై ప్రశంసలు కురిపించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఇంత ఫియర్‌లెస్‌గా ఆడటం చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడిన జట్టు మంచి స్కోర్ సాధించగా, బౌలింగ్‌లో కూడా కట్టుదిట్టంగా ఆడి ముంబై ఇండియన్స్‌ను 27 పరుగుల తేడాతో ఓడించింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన Hardik Pandya తమ జట్టు ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్‌లో చేసిన తప్పులేనని అంగీకరించాడు. ముఖ్యంగా పవర్ ప్లే సమయంలో ప్రణాళికలకు అనుగుణంగా బౌలింగ్ చేయలేకపోవడం వల్ల ప్రత్యర్థి జట్టుకు మంచి ఆరంభం దక్కిందని తెలిపారు. ప్రారంభ ఓవర్లలోనే ఒత్తిడి తీసుకురావాల్సిన సమయంలో అది చేయలేకపోయామని ఆయన చెప్పారు.
అలాగే, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, అతను ఆడిన ధైర్యమైన షాట్లు తనను ఆశ్చర్యానికి గురి చేశారని అన్నారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఇంత నమ్మకంతో ఆడటం గొప్ప విషయం అని ప్రశంసించారు. భవిష్యత్తులో అతను ఇంకా మెరుగ్గా రాణించి పెద్ద స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగుల భారీ స్కోర్ చేసింది. యశస్వి జైస్వాల్ (32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా, వైభవ్ సూర్యవంశీ (14 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 39) దూకుడుగా ఆడాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అల్లా మొహమ్మద్ గజన్‌ఫర్ (2/21) రెండు వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టాడు. బుమ్రా, బౌల్ట్, హార్దిక్, దీపక్ చాహర్ తీవ్రంగా నిరాశపర్చారు.
