టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్-8 దశలో సెమీఫైనల్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది. గ్రూప్-1లో ప్రతి మ్యాచ్ కీలకంగా మారడంతో పాయింట్ల పట్టికలో పోటీ తీవ్రత పెరిగింది. ఇప్పటికే గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలిచిన వెస్టిండీస్ జట్టు అదే జోష్‌ను సూపర్-8లోనూ కొనసాగిస్తోంది.
సోమవారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు 30 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. తర్వాత వచ్చిన హెట్మేయర్ పది పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చినా, ఆ క్యాచ్ పట్టుకోవడంలో జింబాబ్వే ఫీల్డర్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో హెట్మేయర్‌కు లైఫ్ లభించింది.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న హెట్మేయర్ వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. కేవలం 34 బంతుల్లో 84 పరుగులు చేసి వెస్టిండీస్‌కు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. హెట్మేయర్‌కు తోడు రొవన్ పొవల్ 35 బంతుల్లో 59 పరుగులు చేసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో 20 ఓవర్లలో వెస్టిండీస్ 254 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే మొదటి రెండు ఓవర్లలో 20 పరుగులు చేసినప్పటికీ, ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. ఫలితంగా 147 పరుగులకే పరిమితమై 107 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
