కుల్దీప్, బుమ్రాకు రెస్ట్? నెదర్లాండ్స్ మ్యాచ్‌కు టీమిండియా కొత్త ప్లాన్!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో వరుసగా మూడు విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టి దూసుకెళ్తున్న టీమిండియా ఇప్పుడు తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. గ్రూప్-ఏలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా బుధవారం రాత్రి జరగనున్న ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఎదుర్కోనుంది. ఇప్పటికే సూపర్-8కు అర్హత సాధించింది.
ఇప్పటివరకు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ సమతుల ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. టాప్ ఆర్డర్ దూకుడుగా ఆడుతుండగా, మిడిల్ ఆర్డర్ స్థిరత్వాన్ని ఇస్తోంది. బౌలర్లు కూడా కీలక సమయంలో వికెట్లు తీస్తూ జట్టుకు బలంగా నిలుస్తున్నారు.
అయితే మొన్న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎక్స్‌ట్రా స్పిన్నర్‌గా బరిలోకి దిగి చెత్త ఫీల్డింగ్‌తో హార్దిక్ పాండ్యా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహానికి గురై వార్తల్లో నిలిచిన కుల్దీప్ యాదవ్‌పై వేటు పడనుంది. అహ్మదాబాద్ పిచ్ పేస్‌తో పాటు స్పిన్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌లో అదరగొట్టిన కుల్దీప్ ఫీల్డింగ్ విషయంలో కొంచెం తడబడినట్లు కనిపించాడు.
ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌తో పాటు జస్‌ప్రీత్ బుమ్రాకు కూడా రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం. జస్‌ప్రీత్ బుమ్రా కీలకమైన బౌలర్ కావడంతో ఇలాంటి కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి ఇచ్చి తన స్థానంలో మహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే అతను మళ్లీ బెంచ్‌కే పరిమితమవుతాడు. మిగతా బౌలింగ్ కాంబినేషన్‌లో మార్పులు జరిగే అవకాశం లేదు.
నెదర్లాండ్స్‌తో భారత్ తుది జట్టు (అంచనా)
- ఇషాన్ కిషన్
- అభిషేక్ శర్మ
- తిలక్ వర్మ
- సూర్యకుమార్ యాదవ్
- హార్దిక్ పాండ్యా
- శివమ్ దూబే
- రింకూ సింగ్
- అక్షర్ పటేల్
- అర్ష్‌దీప్ సింగ్
- జస్‌ప్రీత్ బుమ్రా / మహమ్మద్ సిరాజ్
- వరుణ్ చక్రవర్తీ

