ఇంట్లో ఈగలు, దోమలు, బొద్దింకలు వంటి కీటకాల బెడదతో చాలా మంది రోజూ ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు ఎంత శుభ్రంగా, పరిశుభ్రంగా ఉంచుకున్నా కూడా ఇవి ఎక్కడో ఒకచోట నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలం, వేసవికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది.
ఈగలు ఆహారంపై కూర్చుని రోగకారక బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తే, దోమలు డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులకు కారణమవుతాయి. అలాగే బొద్దింకలు వంటగదుల్లో తిరుగుతూ ఆహారాన్ని కలుషితం చేసి పిల్లలు, పెద్దల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి.
వీటిని తరిమికొట్టేందుకు చాలామంది మార్కెట్లో దొరికే స్ప్రేలు, పురుగుమందులు వాడుతుంటారు. కానీ ఇవి చిన్న పిల్లలు, పెంపుడు జంతువులకు ప్రమాదకరం కావొచ్చు. అయితే రసాయనాలు అవసరం లేకుండా సహజంగా ఈ కీటకాలను దూరం పెట్టే మార్గం ఉంది. అదే కర్పూరం.
పూజల్లో ఉపయోగించే కర్పూరం.. ఈగలు, దోమలు, బొద్దింకలు తదితరాలను తరిమికొట్టడంలోనూ చాలా ఉపయోగపడుతుంది.
🪳 బొద్దింకలను దూరం చేసే విధానం
కర్పూరం తీసుకుని, టిష్యూ పేపర్ లేదా పలుచని గుడ్డలో చుట్టి వంటగదిలో సింక్ దగ్గర, డ్రైనేజ్ వద్ద, మూలల్లో ఉంచాలి.
కర్పూరం నుంచి వచ్చే తీవ్రమైన వాసన బొద్దింకలకు అసహనంగా ఉండటంతో అవి అక్కడే ఉండలేక వంటగది నుంచి పారిపోతాయి.
🦟 ఈగలు, దోమలను తరిమికొట్టండిలా… సహజంగా, సురక్షితంగా
ఏం చేయాలి?
కొద్దిగా కర్పూరం తీసుకుని చిన్న ప్లేట్‌లో లేదా లోహపు కప్పులో వెలిగించాలి. దోమలు, ఈగలు ఎక్కువగా ఉండే హాల్, బెడ్‌రూమ్, కిచెన్ దగ్గర ఉంచాలి.
🔥 కర్పూరం వెలిగినప్పుడు వచ్చే పొగ, వాసన దోమలకు, ఈగలకు అస్సలు నచ్చదు. అందువల్ల అవి అక్కడ నిలవలేక ఇంట్లోకి రాకుండా పారిపోతాయి.
ఈ విధానం వల్ల కెమికల్స్ అవసరం లేకుండా ఇంటిని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
