ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రీపెయిడ్ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే, నిశ్శబ్దంగా తన అత్యంత పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లలో ఒకటైన ₹107 ప్యాక్ వ్యాలిడిటీని తగ్గించింది. ఈ అనూహ్య నిర్ణయం వినియోగదారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది.
ఇప్పటికే ప్రైవేట్ టెలికాం సంస్థలు ధరలు, వ్యాలిడిటీల్లో మార్పులు చేస్తూ వినియోగదారులపై భారాన్ని పెంచుతున్న సమయంలో, బీఎస్ఎన్ఎల్ కూడా అదే దారిలో నడవడం పట్ల కస్టమర్లు మరింత నిరాశ చెందుతున్నారు. చాలామంది సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇలా ప్రవర్తించాల్సి వస్తుందా అంటున్నారు.
వినియోగదారుల మాటల్లో, “BSNL పేద, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పెద్దగా ఆదరణగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ మార్పులతో ఆ ప్రయోజనం కూడా తగ్గిపోతోంది” అని వ్యాఖ్యానిస్తున్నారు.
తాజా మార్పుల ప్రకారం, ₹107 ప్రీపెయిడ్ ప్లాన్‌కు ఇంత వరకు లభించిన 28 రోజుల వ్యాలిడిటీని ఇప్పుడు కేవలం 22 రోజులకు కుదించారు. అంటే వినియోగదారులు ఇదే ప్లాన్ కోసం అదే ధర చెల్లిస్తున్నప్పటికీ, అందులో gg వచ్చే రోజులు మాత్రం గణనీయంగా తగ్గుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొన్నేళ్ల క్రితం ఇదే ప్లాన్‌కు 35 రోజుల వ్యాలిడిటీ ఉండేది. అప్పటి నుంచి దశలవారీగా 35 నుంచి 28, ఇప్పుడు 22 రోజులకు తగ్గించడం వల్ల ధరను ప్రత్యక్షంగా పెంచకపోయినా, వినియోగదారులపై పరోక్షంగా అదనపు భారం పడుతున్నట్టే అయింది.
