కొత్తిమీర ఒక అద్భుతమైన ఔషధ గుణాలున్న హెర్బల్ ఆకు అని చెప్పొచ్చు. ఇది కేవలం వంటకాలకు రుచి, వాసన మాత్రమే కాదు — శరీరానికి అవసరమైన అనేక పోషకాలను కూడా అందిస్తుంది. కొత్తిమీరలో విటమిన్ C, K, A తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
కొత్తిమీర అంటే ప్రతి కూరకీ ప్రాణం అంటారు. ఈ ఆకులు దాదాపు ప్రతి వంటలోనూ వాడతాం — పప్పు, కూర, సూప్, చట్నీ, సాంబార్… ఏ వంటకమయినా కొత్తిమీర వాసన వస్తే రుచి రెట్టింపు అవుతుంది. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో చిన్న కట్ట కొత్తిమీరకే 20 రూపాయలకుపైగా తీసుకుంటున్నారు. వారానికి సరిపడా కొంటే కనీసం 50 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు చేసి తెచ్చుకున్నా, రెండో రోజు కొత్తిమీర వాడదగ్గ స్థితిలో ఉండదు — వాడిపోతుంది, వాసన తగ్గిపోతుంది.
ఇలా బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే కొత్తిమీరను పెంచేస్తే ఎంత బాగుంటుందో కదా!
ఎలా పెంచుకోవాలి
ముందుగా మనం కొత్తిమీర విత్తనాలు (ధనియాలు) తీసుకోవాలి. ఇవి సులభంగా ఇంట్లో దొరుకుతాయి. ముందుగా వీటిని ఒక రోజు పాటు ఎండలో ఆరబెట్టండి. ఆ తర్వాత కొంచెం నలపండి — అప్పుడు అవి రెండుగా విడిపోతాయి. ఇలా చేయడం వల్ల మొలకలు త్వరగా వస్తాయి.
తరువాత ఈ విత్తనాలను ఒకటి నుంచి రెండు రోజులు (24–48 గంటలు) నీటిలో నానబెట్టాలి. నీటిలో నానబెట్టిన తర్వాత వాటిని నీడలో కాస్త ఆరబెట్టండి, పూర్తిగా ఎండిపోకుండా చూడండి.
ఇప్పుడు ఈ విత్తనాలను తేమతో ఉన్న మట్టిలో 1 నుంచి 2 అంగుళాల లోతులో వేయాలి. పైగా కొంచెం మట్టి తోమి, తేలికగా నీరు పోయండి. రోజుకి ఒక్కసారి నీరు వేస్తూ ఉండండి. మట్టి తడిగా ఉండాలి కానీ ఎక్కువగా నీరు పోయకండి — లేదంటే విత్తనాలు కుళ్లిపోతాయి.
ఈ కుండ లేదా ట్రేను సూర్యకాంతి బాగా వచ్చే ప్రదేశంలో ఉంచండి. మూడు నాలుగు రోజులలో మొలకలు వస్తాయి, వారం రోజుల్లో పచ్చగా కొత్తిమీర ఆకులు మొలుస్తాయి.
