సుహాస్ షాకింగ్ కామెంట్స్.. 45 రోజులు సముద్రంలోనే షూటింగ్, ‘కొన్నిసార్లు బతుకుతామో లేదో అనిపించింది

తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ యాక్టర్ సుహాస్ కమెడియన్‌గా కెరీర్‌ను ప్రారంభించి, కలర్ ఫోటోతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. అటు హీరోగా మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో విలన్‌గా నటించి మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.

suhas vilan look in mandadi

తాజాగా మండాడి అనే సినిమాతో విలన్‌గా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సినిమాకు పుగజేంధి మతిమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. సూరి హీరోగా నటిస్తుండగా, మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను స్పీడ్ పెంచిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతోంది.

కోస్తా తీరప్రాంతంలో జరిగే పడవల పందెం నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో సుహాస్ ఒక వైల్డ్ విలన్ తరహా విలక్షణమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన సుహాస్.. తాను ఎప్పుడూ చేయని తరహా సినిమాను చేశానని, తమ చిత్రబృందం ఎదుర్కొన్న ప్రాణాంతకమైన అనుభవాలను వెల్లడించాడు.

ఈ సినిమాలో క్లైమాక్స్ షూటింగ్ కోసం చాలా కష్టపడ్డామని సుహాస్ తెలిపాడు. క్లైమాక్స్ సన్నివేశాలను దాదాపు 45 రోజుల పాటు సముద్రంలోనే చిత్రీకరించామని చెప్పాడు. ప్రతిరోజూ ఉదయమే పడవల్లో సముద్రంలోకి వెళ్లి, రోజంతా నీటిపైనే గడుపుతూ షూటింగ్ పూర్తి చేసుకుని సాయంత్రానికి ఒడ్డుకు వచ్చేవారమని వివరించాడు.

సముద్రంలో అలల తీవ్రత, ఊహించని వాతావరణ మార్పుల వల్ల షూటింగ్ సమయంలో 4 నుంచి 5 సార్లు పడవలు బోల్తా పడ్డాయని సుహాస్ వెల్లడించాడు. ఆ క్షణాల్లో ప్రాణాలు పోతాయేమోననే భయం కలిగిందని ఎమోషనల్ అయ్యాడు.

“కొన్నిసార్లు అసలు బతుకుతామో లేదో అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ కోసం అయితే చచ్చి బతికాం” అని సుహాస్ చెప్పుకొచ్చాడు. జీవితంలో ఇంకెప్పుడూ ఇలాంటి రిస్క్ ఉన్న సినిమాలు చేయనని, రిస్క్ కంటే జీవితం చాలా ముఖ్యమని సుహాస్ తెలిపాడు.

తన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Post a Comment

Previous Post Next Post