40 ఏళ్ల ఎదురుచూపులకు తెర.. కొల్లేరు లంక గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీస్

కైకలూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లేరు లంక గ్రామాల ప్రజల ఎన్నో ఏళ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న పెద్దట్లగాడి, పెనుమాక లంక, ఇంగిలిపాక లంక గ్రామాలకు తొలిసారిగా ఆర్టీసీ బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయి.ఇప్పటివరకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, మహిళలు, వృద్ధులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ముఖ్యంగా అత్యవసర పనులు, విద్య, వైద్యం, మార్కెట్ అవసరాల కోసం బయటకు వెళ్లాలంటే ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వచ్చేది.

కొల్లేరు లంక గ్రామాలకు 40 ఏళ్ల తర్వాత ప్రారంభమైన ఆర్టీసీ బస్సు సేవలు

తాజాగా ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభం కావడంతో ఈ సమస్యలకు కొంతమేర పరిష్కారం లభించనుంది. గ్రామాల నుంచి ఏలూరు తదితర ప్రాంతాలకు ప్రయాణం సులభం కావడంతో ప్రజలకు సమయం, ఖర్చు కూడా ఆదా కానుంది.బస్సు సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వయంగా బస్సులో టికెట్ తీసుకుని ప్రయాణించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో పాటు కూటమి నాయకులు కూడా బస్సులో ప్రయాణించి లంక గ్రామాల ప్రజలతో మమేకమయ్యారు. తమ ప్రాంతానికి బస్సు రావడం ఎంతో సంతోషంగా ఉందని, అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు చేరేందుకు, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు ఈ సర్వీసు ఎంతో ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు

ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రవాణా సమస్యకు పరిష్కారం లభించడంతో లంక గ్రామాల ప్రజల్లో ఆనందం నెలకొంది. కొత్త బస్సు సర్వీసు అందుబాటులోకి రావడంతో రోజువారీ ప్రయాణాలు మరింత సులభం కానున్నాయని స్థానికులు తెలిపారు. ఈ సౌకర్యం కోసం కృషి చేసిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారికి , ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post

Contact Form