ఈ మధ్యకాలంలో మొబైల్ రీఛార్జ్ ధరలు బాగా పెరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. జియో, ఎయిర్టెల్, వీఐ వంటి అన్ని టెలికం నెట్‌వర్క్‌లు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను విపరీతంగా పెంచేశాయి. దీంతో మనలో చాలామంది ఇంటర్నెట్ అవసరం లేకపోయినా, ప్లాన్‌లో డేటా ఉండటం వల్ల అధిక ధరతో రీఛార్జ్ చేయాల్సి వస్తోంది.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఒక కీలక నిర్ణయంపై ఆలోచిస్తోంది. కేవలం వాయిస్ కాల్స్, SMS సేవలు మాత్రమే అవసరమైన వినియోగదారుల కోసం ప్రత్యేక టారిఫ్ ప్లాన్‌లను తీసుకురావాలని డ్రాఫ్ట్ ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే లక్షలాది మంది మొబైల్ వినియోగదారుల నెలవారీ రీఛార్జ్ ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
డ్రాఫ్ట్ ప్రతిపాదన ప్రకారం టెలికం కంపెనీలు డేటా లేకుండా ప్రత్యేక వాయిస్ కాల్, SMS ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లను 28 రోజులు, 56 రోజులు, 84 రోజుల వ్యాలిడిటీతో అందించే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా ప్లాన్‌ను ఎంచుకునే వెసులుబాటు కలుగుతుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ అవసరం లేని వారు అనవసరంగా డేటా కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.
ట్రాయ్ డ్రాఫ్ట్ ప్రతిపాదన అమల్లోకి వస్తే రీఛార్జ్ ధరలు కూడా తగ్గే అవకాశముందని టెలికం రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డేటా సేవలను తొలగించడం వల్ల ప్రస్తుతం ఉన్న కొన్ని ప్లాన్‌లతో పోలిస్తే ధరలు సుమారు 50 నుంచి 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి.
ఉదాహరణకు ప్రస్తుతం నెలకు రూ.300 వరకు రీఛార్జ్ చేస్తున్న వినియోగదారులు, భవిష్యత్తులో కేవలం వాయిస్ కాల్స్ మరియు SMS సేవల కోసం సుమారు రూ.125 వరకు మాత్రమే చెల్లించే అవకాశం ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే ఇవి ప్రస్తుతం డ్రాఫ్ట్ ప్రతిపాదన ఆధారంగా వినిపిస్తున్న అంచనాలు మాత్రమే. ట్రాయ్ తుది మార్గదర్శకాలు విడుదలైన తర్వాతే అసలు ధరలు, ప్లాన్‌ల వివరాలు అధికారికంగా స్పష్టమవుతాయి.
Ravindra G
✓ Verifiedమేము ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యా వార్తలు, అన్ని ప్రభుత్వ ఉద్యోగలకు సంబంధించిన పుస్తకాలు న్యూస్ తాజా అప్‌డేట్లను ఆధారంగా పరిశీలించి, నమ్మదగిన, ఖచ్చితమైన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించడం మా లక్ష్యం. News
