ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ యాజమాన్య హక్కుల వివాదంలో ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో రాజ్ కుంద్రాకు చెందిన కుకీ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ ద్వారా పరోక్షంగా 11.7 శాతం వాటా ఉండేది. 2015లో ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఫ్రాంచైజీపై రెండేళ్ల నిషేధం విధించారు. ఆ సమయంలోనే కుంద్రా తన వాటాలను బదిలీ చేశారు.
2019లో ఈఎంవీ (EMV) అనే సంస్థతో కుంద్రా ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం సుమారు 4.94 మిలియన్ అమెరికన్ డాలర్లు తీసుకున్న ఆయన, భవిష్యత్తులో ఎలాంటి క్లెయిమ్‌లు చేయబోనని అంగీకరించారు. ఒకవేళ ఏదైనా వివాదం తలెత్తితే ఇంగ్లాండ్ కోర్టుల పరిధిలోనే పరిష్కరించుకోవాలని కూడా ఒప్పందంలో పేర్కొన్నారు.
అయితే ఇటీవల రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ మెరుగైన ప్రదర్శనతో విలువ పెరగడంతో, మెజారిటీ వాటాను ఈఎంవీ సంస్థ విక్రయించేందుకు సిద్ధమైంది. దీనికి రాజ్ కుంద్రా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
2019 ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ కుంద్రా ముంబైలోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్టీ)తో పాటు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈఎంవీ సంస్థ లండన్ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ గ్రిఫిత్స్ సోమవారం తుది తీర్పు వెలువరించారు. కుంద్రా చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పు రాజ్ కుంద్రాకు పెద్ద న్యాయ పరాజయంగా భావిస్తున్నారు. అయితే ఈ వివాదం ప్రస్తుత రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్వహణ లేదా ఐపీఎల్ కార్యకలాపాలపై ఎలాంటి ప్రత్యక్ష ప్రభావం చూపదని కోర్టు పేర్కొంది. ఈ కేసు గతంలో జరిగిన షేర్‌హోల్డింగ్, వాటాల బదిలీ మరియు ఒప్పందాలకు మాత్రమే పరిమితమని స్పష్టం చేసింది.
అలాగే 2019 ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు రాజ్ కుంద్రా తీసుకున్న 4.94 మిలియన్ డాలర్లను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని న్యాయమూర్తి జస్టిస్ గ్రిఫిత్స్ ఆదేశించారు.
ఇదిలా ఉండగా, ఇటీవల రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ మెజారిటీ వాటాను సుమారు 1.65 బిలియన్ డాలర్ల విలువతో ఒక కన్సార్టియం కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ పరిణామం కూడా వివాదానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా భావిస్తున్నారు.
Ravindra G
✓ Verifiedమేము ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యా వార్తలు, అన్ని ప్రభుత్వ ఉద్యోగలకు సంబంధించిన పుస్తకాలు న్యూస్ తాజా అప్‌డేట్లను ఆధారంగా పరిశీలించి, నమ్మదగిన, ఖచ్చితమైన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించడం మా లక్ష్యం. News

