కలిదిండిలో ఈ నెల 10న నిర్వహించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు శుక్రవారం పర్యవేక్షించారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్‌గౌడ, ఎస్పీ కిశోర్, ఆర్డీవో లక్ష్మీప్రసన్న సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.
సభకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ వెట్రిసెల్వి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. హెలిప్యాడ్, ప్రజా వేదిక, కేడర్ సమావేశం, పాస్ పుస్తకాల పంపిణీ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు కొత్త పాస్ పుస్తకాల పంపిణీ
సీఎం పర్యటనలో భాగంగా నిర్వహించనున్న ప్రజా దర్బార్‌లో 22ఏ నిషేధిత జాబితా నుంచి విముక్తి పొందిన భూములకు సంబంధించిన కొత్త పాస్ పుస్తకాలను రాజముద్రతో రైతులకు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి పూర్తి సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
పటిష్ట బందోబస్తు
సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ కిశోర్ తెలిపారు. వాహనాలు, బైక్‌లను కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపివేయాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
సభా ప్రాంగణానికి వెళ్లే రహదారులతో పాటు పరిసర ప్రాంతాల్లో బాంబ్ డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్, పోలీసు బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఫొటోతో కూడిన పాస్ ధరించాలని సూచించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసే సీసీ కెమెరాల ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని ఎస్పీ వెల్లడించారు.
